How To Create a Website

Tuesday, 30 August 2016

Polalam Amavasya Pooja Vidhanam











పొలాల అమావాస్య: ( 1 - 09 -2016, గురువారం )
శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలుతమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకుఅనాది నుంచి వస్తున్న ఆచారం. 
. ఈ రోజు మహిళలు పుణ్యమైన పొలాల అమావాస్య వ్రతమును ఆచరిస్తారు. ఆ వ్రత కథ ఇదిగో....
ఒకసారి కైలాసానికి వెళ్ళిన ఇంద్రాణిదేవి పార్వతీ దేవిని సత్పుత్రులను మరియు సకల శుభాలను కలిగించే ఒక వ్రతం గురించి తెలుపమని వేడుకుంది. అప్పుడు మాత పోలా అమావాస్య వ్రతం గురించి చెప్పింది.
పూర్వం శ్రీధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు.ఆయన భార్య సుమిత్ర.వారికి ఎనిమిది మంది పుత్రులు.వారిలో పెద్దవాడి పేరు శంకరుడు,ఆయన భార్య విదేహ. ఈమెకు కలిగిన శిశువులందరూ పుట్టగానే మరణించేవారు.
ఒకసారి శ్రీధరుడి తండ్రి శ్రాద్ధము ఆరంభమగుచుండగా విదేహ ఒక మృత శిశువుకు జన్మనిచ్చింది. మామగారి శ్రాద్ధం భంగమగునని కోడలు విదేహను ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అత్త సుమిత్ర బెదిరించింది. భయపడిన విదేహ మృత శిశువును తీసుకొని అడవిలో ఉన్న ఒక ఆలయంలోకి ప్రవేశించింది. మృతశిశువును ఆలయంలో ఉంచవద్దని ఆ దేవాలయ పాలకురాలు విదేహను ఆదేశించగా, భయపడ్డ విదేహ తన దీనగాథను ఆమెకు వివరించింది. దయామూర్తి అయిన ఆ దేవాలయ పాలకురాలు విదేహతో ఇలా అన్నది "అమ్మా విదేహ! నీ కష్టాలు త్వరలోనే దూరమవుతాయి. శ్రావణ మాసపు అమావాస్య నాడు ఈ ఆలయానికి 64 మంది దివ్య యోగినులు వచ్చి ఆ ఆదిపరాశక్తిని పూజించి వెళతారు. ఆ రోజున నీవు వారికి నీ కష్టాలను తెలియజేయి. వారు నీకు తప్పక సాయం చేస్తారు.వారు వచ్చే వరకు ఈ మారేడు పొదలో దాగుండు" అని తెలిపింది. ఇది విన్న విదేహ అలాగే చేసింది. శ్రావణమాస అమావాస్యనాడు మధ్యరాత్రి 64 యోగినులు ఆ దేవి పూజకు విచ్చేయగా, విదేహ వారు వచ్చే వరకు మారేడు పొదలో దాగి ఉంది.
పూజముగిసిన తర్వాత,అక్కడ మానవ గంధమును పసిగట్టిన యోగినులు విదేహను బయటకు రమ్మని పిలవగా, విదేహ బయటకువచ్చి తన కష్టాలను వారికి తెలుపగా, కరుణా సాగరులైన ఆ యోగినులు విదేహ కుమారులందరినీ బ్రతికించి ప్రతి సంవత్సరము శ్రావణ మాసపు అమావాస్యనాడు పోలా వ్రతం ఆచరించినచో నీకు తప్పక మంచి జరుగునని చెప్పి అంతర్థానమైయ్యారు.
సజీవులైన కుమారులతో విదేహ ఇంటికి రాగ భర్త, అత్తమామలు చాలా సంతోషించారు. అలా విదేహ ప్రతి యేటా శ్రావణ అమావాస్య నాడు పోలా వ్రతమును ఆచరించి సుఖసంతోషాలను పొందింది. కావున ఈ వ్రతాన్ని భూలోకాన శ్రావణ ఆమావాస్యనాడు ఎవరు ఆచరిస్తారో వారు సకల సుఖాలను అనుభవించి, సద్గతులు పొందుతారని పార్వతీ మాత ఇంద్రాణిదేవికి వివరించింది.


No comments:

Post a Comment